రూపాయి విలువ తగ్గడం అంటే ఏమిటి? గ్రూప్-1 మెయిన్స్ ప్రత్యేకం

  • డాలర్‌‌తో రూపాయి విలువ తగ్గడం అంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే టూరిస్టులు కాని, విదేశాలలో ఉన్న మన బంధువులు కాని మనకు డబ్బు పంపాలి అంటే వారు మన దేశ రూపాయిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారి వద్ద గల 100 డాలర్లతో మన రూపాయిని కొనుగోలు చేసినప్పుడు ఇది వరకటి కంటే ఎక్కువ రూపాయలు పొందితే రూపాయి విలువ తగ్గినట్టు.
  • ఉదాహరణకు గతంలో 100 డాలర్లకు 4500 రూపాయలు వస్తే ఇప్పుడు అదే 100 డాలర్లకు 5500 పైగా రూపాయలు వస్తున్నాయి. అంటే గతంతో పోలిస్తే ఎక్కువ రూపాయలు వస్తున్నాయి. మనం ఇదివరకు 100 రూపాయలు ఇచ్చి కొన్న వస్తువులు, ఈసారి అదే 100 రూపాయలకు అవే వస్తువులు ఇదివరకటి కంటే ఎక్కువ వస్తే దాని అర్థం వస్తువుల ధర పడిపోవడమే కదా? అదే విధంగా రూపాయి కూడా. ఒక దేశ కరెన్సీ దాని సొంత భౌగోళిక ప్రాంతంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దాని భౌగోళిక ప్రాంతం వెలుపల డబ్బుతో సంబంధమైన యే లావాదేవి జరపాలన్నా పరస్పర ఆమోదయోగ్యమైన కరెన్సీ ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా అంతర్జాతీయ లావాదేవీలను యూఎస్‌ను పరస్పర ఆమోదయోగ్యమైన కరెన్సీగా వాడుతారు. అందువలనే ఒక దేశ కరెన్సీ యొక్క విలువని డాలరుతో పోలుస్తారు. రూపాయిని డాలరుతో పోల్చడాన్ని యూఎస్‌డి-ఐఎన్‌ఆర్ అంటారు. అంటే ఒక డాలర్ విలువ ఎన్ని రూపాయలకు సమానం అనే విషయం తెలుస్తుంది. రూపాయి పతనం వల్ల మన దేశం అధిక విదేశీ నిధులను ఎక్కువగా పొందడం కష్టమవుతుంది. రూపాయి విలువ పతనం కావడం అనేది డిమాండ్, సప్లైతోపాటు ఆర్థిక మరియు రాజకీయ కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం చాలా సర్వసాధారణం. ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకం పొందితే, దిగుమతి చేసుకున్న వస్తువులకు విదేశీ మారకం చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా డాలర్ రూపంలోనే జరుగుతుంది. అయితే, మన దేశం ఎగుమతుల ద్వారా పొందే విదేశీ మారకం కంటే, చేసుకొనే దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారకం ఎక్కువ కావడం వల్ల విదేశీ మారక ద్రవ్యలోటు ఏర్పడుతుంది. ఈ లోటు కొంతవరకు ఎన్నారైలు పంపే డబ్బు, విదేశీ అప్పుల వల్ల తీరితే మిగిలిన లోటు పూరించడానికి మనం అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ అధికంగా ఉంటుందో అప్పుడు దాని విలువ పెరుగుతుంది. దానితో మన రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. మన దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు తగ్గడంతో రావలసిన డాలర్‌ ప్రవాహం తగ్గడం వల్ల కూడా రూపాయి పతనం అవుతుంది. సాధారణంగా దేశంలో భారీ విదేశీ మారకం నిల్వ ఉంటుంది. వాటి నుంచి దేశం చేసుకొనే దిగుమతులకు కావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎప్పుడైతే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉంటాయో అప్పుడు మన అవసరాలకు సరిపడా డాలర్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. దానితో రూపాయి విలువ తగ్గిపోతుంది. స్వల్ప కాలిక రుణాలు చెల్లించడానికి కూడా డాలర్లు సేకరించాల్సి ఉంటుంది. దానితో డాలర్ విలువ పెరిగి రూపాయి పతనం అవుతుంది.