పది తర్వాత పయనమెటు

పదోతరగతి పూర్తయిన తర్వాత ప్రతి అడుగు కీలకమైంది. అదే భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. కెరీర్‌ను అత్యున్నత స్థాయిలో నిలుపుతుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. తమ అభిరుచి, లక్ష్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

నా లక్ష్యం ఏమిటి? నేను ఏమవ్వాలనుకుంటున్నాను? అందుకోసం నేను ఏం చేయాలి? పదో తరగతి పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థి వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే ఇక్కడ స్పష్టత చాలా ముఖ్యం. అనాలోచితంగా తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ఉదాహరణకు ఇంటర్మీడియట్‌లో సీఈసీ తీసుకుంటే భవిష్యత్తులో ఎంసెట్ రాయలేరు కదా! కచ్చితంగా ఎంపీసీ లేదా బైపీసీ చదవి ఉండాలి. అలాగే, జీవితంలో త్వరగా స్థిరపడాలి లేదా స్వయం ఉపాధి పొందాలంటే డిప్లొమా లేదా ఐటీఐ చక్కటి మార్గమని తెలిసి ఉండాలి కదా. అందుకే పదోతరగతి తర్వాత సరైన, సరిపోయే మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం.

1. ఆర్ట్స్

భవిష్యత్తులో ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తులు లేదా లాయర్ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల వైపు వెళ్లాలనుకొనే విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్‌ గ్రూప్స్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల అనుకున్న లక్ష్యానికి గట్టి పునాదులు పడుతాయి. ఇంటర్మీడియట్‌లో చరిత్ర, భూగోళశాస్త్రం, సైకాలజీ, రాజనీతిశాస్త్రం, ఎకనామిక్స్, సోషియాలజీ, తత్త్వశాస్త్రాలను ఒకటి లేదా రెండు సబ్జెక్టులుగా చదివే అవకాశం ఉంటుంది. ఆ సబ్జెక్టులపైనే డిగ్రీ, పీజీ స్థాయిలో స్పెషలైజేషన్ చేయడం ద్వారా ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తిని చేపట్టే అవకాశం ఉంటుంది.

2. కామర్స్

సీఏ, బ్యాంక్ పీఓ, ఫైనాన్స్ మేనేజర్, స్టాక్ బ్రోకర్, మార్కెటింగ్ మేనేజర్, ఎకనామిస్ట్, అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్, హెచ్‌ఆర్, కాస్ట్ అకౌంటెంట్ తదితర మేనేజ్‌‌మెంట్ రంగంలో స్థిరపడాలనుకొనే వారు కామర్స్ కోర్సులను ఎంచుకోవడం బెస్ట్. ఇందుకోసం ఎంఈసీ లేదా సీఈసీ సరైన ఎంపిక. కామర్స్‌లో బలమైన పునాదులు పడటానికి ఇది దోహదం చేస్తుంది. ఆ తర్వాత బీకాం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్స్ ఇన్ ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంబీఏ, ఎంకామ్, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ చదవడం ద్వారా కెరీర్‌ను అత్యున్నత స్థాయిలో నిలుపుకోవచ్చు.

3. సైన్స్
ఇంటర్మీడియ్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ చదవే వారికి అపార అవకాశాలు ఉన్నాయి. ఇంటర్ అర్హతతోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ‌లో చేరే అవకాశం ఉంటుంది. ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్, వెటర్నరీ డాక్టర్, అగ్రికల్చరల్ బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్ వంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరవచ్చు. నీట్ ద్వారా మెడిసిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మాసీ, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, నర్సింగ్ కోర్సుల ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశం ఉంటుంది.

4. డిప్లొమా

ఆర్ట్స్, సైన్స్, కామర్స్ రంగాల వైపు ఆసక్తి లేనివారు ఇంజినీరింగ్ కోర్సుల్లో డిప్లొమా చేయడం ఉత్తమం. మూడేండ్ల డిప్లొమా అనంతరం ఈ-సెట్ ద్వారా బీఈ/ బీ.టెక్‌‌లో నేరుగా సెకండ్ ఈయర్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంతేకాదు అత్యుత్తమ కళాశాలలో సీటు దక్కించుకొనే అవకాశం కూడా లభిస్తుంది. అలా కాకుండా డిప్లొమా పూర్తికాగానే జాబ్‌‌లో కూడా చేరవచ్చు. వీరికి ఇంజినీరింగ్, కెమికల్, ఆటో పరిశ్రమలు రాచబాటలు వేస్తున్నాయి. స్వయం పొందడానికి కూడా డిప్లొమా అత్యుత్తమ ఎంపిక. మన రాష్ట్రంలో పలు కళాశాలలు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఐటీ, ప్యాబ్రికేషన్, ఆటో మొబైల్, కెమికల్, బయోమెడికల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి.

 

5. ఐటీఐ

పదోతరగత తర్వాత రెండు మూడేండ్లలో జీవితంలో స్థిరపడాలనుకొనే వారికి బెస్ట్ చాయిస్ ఐటీఐ. ఏడాది లేదా రెండేండ్ల కోర్సుతోనే ఉద్యోగ లేదా స్వయం ఉపాధి పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఇండిస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు పలు రకాల ఐటీఐ కోర్సులను అందిస్తున్నాయి. ఐటీఐ ఎలక్ట్రిషియన్, డిజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వైర్‌మెన్, సీఓపీఏ, వెల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబింగ్, మోటార్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 

 

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..