పాలిటెక్నిక్‌లో అగ్రికల్చర్ డిప్లొమా

దిశ, ఎడ్యుకేషనల్ డెస్క్: ఆధునికీకరణ పెరగడంతో వ్యవసాయ రంగంలో రోజురోజుకూ ఉపాధి అవకాశాలు మెరుగుతున్నాయి. సాగుపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడంతో ఉద్యోగాలు కూడా అధికమయ్యాయి. కానీ, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీనిని అధిగమించడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజేటీఎస్ఏయూ) డిప్లొమా కోర్సులను ప్రవేశ పెట్టింది. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ద్వారా అగ్రి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నారు.

పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బోధన, క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా వ్యవసాయంలో నైపుణ్యాభివృద్ధి పెంచడం పీజేటీఎస్‌ఏయూ లక్ష్యం. అందుకే. వ్యవసాయం, సీడ్ టెక్నాలజీ, అగ్రి ఇంజినీరింగ్‌లో పునాదులను గట్టిగా వేయడం కోసం డిప్లొమా కోర్సులను ప్రవేశ పెట్టింది. ఈ కోర్సుల ఉద్దేశం ప్రభుత్వ, ఎన్‌జీఓ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సాంకేతిక మానవ వనరులను అందించడం.

కోర్సులు
పీజేటీఎస్‌ఏయూ ఆధ్వర్యంలోని కళాశాలల్లో మొత్తం నాలుగు రకాల డిప్లొమా కోర్సులను అందిస్తున్నది.
– డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
– డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
– డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్
– డిప్లొమా ఇన్ అగ్రి ఇంజినీరింగ్
1989లో దేశంలోనే మొట్టమొదటి అగ్రికల్చర్ పాల్‌టెక్నిక్ కళాశాలను పాలెంలో ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొత్తం 24 ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. పీజేటీఎస్‌ఏయూ పాలిటెక్నిక్స్‌లో 240, ప్రైవేట్ పాలిటెక్నిక్స్‌లో 630 సీట్లు ఉన్నాయి. పాలిసెట్ ద్వారా ప్రతి ఏటా 870 మందికి ప్రవేశాలను కల్పిస్తున్నారు. డిప్లొమా ఇన్ అగ్రి ఇంజినీరింగ్ మూడేండ్ల కోర్సు కాగా, మిగతా మూడు రెండేండ్ల కోర్సు. విద్యాబోధన కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే జరుగుతుంది.

ఉన్నత విద్యావకాశాలు
డిప్లొమా కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు అగ్రికల్చర్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ చేసే అవకాశం ఉన్నది. ప్రతి ఏటా యూనివర్సిటీ నిర్వహించే అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్ ద్వారా బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బీ.టెక్(అగ్రికల్చర్ ఇంజినీరింగ్)‌లో ప్రవేశాలను కల్పిస్తున్నది.

ఉద్యోగావకాశాలు
అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వ్యవసాయశాఖలో ఉద్యోగం చేయవచ్చు. వ్యవసాయ అనుబంధ ప్రైవేట్ పరిశ్రమలు, విత్తన, పెర్టిలైజర్ కంపెనీలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. డిప్లొమా ఇన్ అగ్రి ఇంజినీరింగ్ సొంతంగా వర్క్‌షాప్ పెట్టుకోవచ్చు. అగ్రికల్చర్ మిషనరీ ఉత్పత్తి పరిశ్రమలో ఉద్యోగం చేయవచ్చు.

అర్హత
– పదోతరగతి ఉత్తీర్ణత. ఓసీ, బీసీ అభ్యర్థులు గ్రేడ్ పాయింట్ అవరజ్(జీపీఏ) హిందీతో సహా 5.0 సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌‌సీ అభ్యర్థులకు 4.0 జీపీఏ అవసరం.
– గత విద్యా సంవత్సరం వరకు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగేండ్లపాటు చదివిన విద్యార్థులకు మాత్రమే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే వారు. ఈ ఏడాది నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 60శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 40శాతం సీట్ల కేటాయించనున్నారు.

ముఖ్యమైన వివరాలు
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ప్రారంభం: మే 24
చివరి తేదీ: జూన్ 11
ప‌రీక్ష‌తేదీ: వెల్ల‌డించాల్సి ఉంది
ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 10 రోజుల అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు.
వెబ్‌సైట్‌: https://polycetts.nic.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..