Home జాబ్స్‌ త్వరలో తెలంగాణలో భారీగా పోలీస్ కొలువులు.. ప్రిపరేషన్ మొదలుపెట్టిండి…

త్వరలో తెలంగాణలో భారీగా పోలీస్ కొలువులు.. ప్రిపరేషన్ మొదలుపెట్టిండి…

రాష్ట్రంలో పోలీసు కొలువులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెలలోనే నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. టీఎస్‌పీఎస్సీ ద్వారా జారీ చేసే నోటిఫికేషన్ల కోసం మరింత కాలం ఆగాల్సిందేనని తెలుస్తోంది. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగా పోలీస్ నియామకాలకు క్లియరెన్స్​ ఇవ్వనుంది.

ముందుగా 10 వేల పోస్టులు..!

ఈ ఏడాదిలో పోలీస్ శాఖలో 19వేల పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసి సీఎంకు అందించారు. ఈ నెలలోనే పోలీస్ శాఖలో 10వేల వరకు పోస్టులకు నోటిఫికేషన్​జారీ చేస్తారని తెలుస్తోంది. ఒకేసారి కాకుండా రెండు విడుతల్లో పోలీస్ శాఖలో నియామకాల ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. 2018లో మరోసారి పెద్ద ఎత్తున పోస్టులు ప్రకటించారు. ఆ సమయంలో 1,217 మంది ఎస్సైలు, 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. పలు కారణాలతో వీటిలో దాదాపు 3 వేల వరకు బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయాయి. వాటి కోసం అభ్యర్థులు కోర్టుకెక్కినా ఫైల్ ముందుకు కదల్లేదు.

ఖాళీల నివేదిక..

ఎస్సై స్థాయిలో 360(సివిల్), 29(ఏఆర్), 20 కమ్యూనికేషన్స్ పోస్టులున్నట్లు సమాచారం. కానిస్టేబుల్స్ స్థాయిలో 7,700 (సివిల్), 6,680 ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ (3,850),15వ బెటాలియన్ (560), కమ్యూనికేషన్స్​250 పోస్టులను ఖరారు చేశారు. ఇలా పోలీస్ శాఖలో మొత్తం 19,449 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారు. వీటన్నింటికీ ఆమోదం తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రిజర్వేషన్లను అనుసరిస్తూ 33% మహిళలకు కేటాయించనున్నారు. ఈ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెలలో దాదాపు 10వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నది. కేబినెట్‌లో చర్చించి, నిర్ణయం తీసుకొని ప్రకటన చేసే చాన్స్ ఉంది.

పదోన్నతుల తర్వాతే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు..

ఇక రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో 65 వేల ఖాళీలు గుర్తించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రాథమికంగానే వీటిని అంచనా వేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా దాదాపు 30% పోస్టుల భర్తీని సూచించినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో 2.73 లక్షల మంది ఉద్యోగులున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జిల్లాలు, జోన్ల వారీగా బదిలీలు చేసి, సర్దుబాటు చేస్తూనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..
Disha Daily Telegram Connect With Telegram