సింధు నాగరికత పతనం

  • నాగరికత ఆవిర్భావం ఎంత వివాదాస్పదమైందో నాగరికత పతనం కూడా అంతే వివాదాస్పదమైంది. నాగరికత పతనంపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. కొంత మంది ప్రకారం నాగరికత హఠాత్తుగా పతనమవగా మరికొందరి ప్రకారం కాలక్రమేణ పతనమైంది.

1. ఆర్యుల దండయాత్ర, వరదలు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా నాగరికత పతనమైనట్లు చాలా కాలం వరకు భావించబడింది.
2. హఠాత్తుగా పతనమైనదనుటకు ఆధారాలు లేకపోలేదు.
ఎ. ఏ సింధు నాగరికత పట్టణం క్రీ.పూ.1750 తర్వాత వర్ధి్ల్లలేదు.
బి. మెసపటోమియన్లు తమ శాసనాలలో క్రీ.పూ.1750 తర్వాత మెలూహ అనే పదాన్ని ప్రస్తావించలేదు.
నాగరికత హఠాత్తుగా పతనమైనదని చెప్పడానికి ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రతిపాదించబడింది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి ఆర్యుల గ్రంథమైన రుగ్వేద ప్రకారం

i. ఆర్య, అనార్యుల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆర్యుల దేవుడైన ఇంద్రుడు పట్టణాలను ధ్వంసం చేసే పురంధరునిగా పిలువబడినాడు. అనార్యులను అంతం చేయుటకు వరుణ అగ్ని వంటి దేవుళ్లు కూడా ప్రార్థించబడినారు.
ii. పురావస్తు ఆధారంగా మొహంజొదారో స్నానవాటికి చుట్టూ గాయాలపాలైన మానవ అస్థిపంజరాలు ఉండటాన్ని బట్టి ఏదో ఊహించని విపత్తు వలనే పట్టణాలు ధ్వంసమయ్యాయని తెలుస్తున్నాయి.
iii. నాగరికత పతనానికి వరదలు కూడా ఒక కారణంగా పరిగణించబడింది. మొహంజొదారో ఏడుసార్లు, చన్హుదార్ మూడు సార్లు వరద ముంపునకు గురయ్యాయి.
iv. భూకంపాలు కూడా నాగరికత పతనానికి కారణమై ఉండవచ్చని భావించబడింది.
కానీ, పురావస్తు పరిశోధనలు పై మూడు వాదనలు తప్పని రుజువు చేశాయి. ఆర్యులు రాకమునుపే అంటే క్రీ.పూ. 1700 నాటికే సింధు నాగరికత పతనం జరిగిపోయింది. నాగరికత పతనాన్ని శాసించకలిగిన మరణాయుధాలు అటు ఆర్యులకు గానీ ఇటు సింధు నాగరికత ప్రజల వద్ద కానీ కనబడలేదు.
అదేవిధంగా తవ్వకాల్లో ఎక్కడ కూడా సామూహిక ఖననాలు లేకపోవడాన్ని బట్టి యుద్ధం జరగలేదని చెప్పవచ్చు.

వరదలు భూకంపాలు కూడా నాగరికత పతనానికి కారణం కాదని రుజువు చేయబడింది. నాగరికత మొత్తాన్ని పతనం చేయకలిగిన స్థాయిలో వరదలు భూకంపాలు సంభవించడం అసంభవం. పైగా వరదల రాక గురించి ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఉండుట వలన నాగరికత పతనానికి ఆస్కారం లేదు. అదేవిధంగా పట్టణాలలో కట్టడాలు స్థిరంగా ఉండుటను బట్టి భూకంపాల వల్ల నాగరికత పతనం కాలేదని చెప్పవచ్చు.

నాగరికత కాలక్రమేణ పతనమైనదనే వాదనను ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. పర్యావరణంలో చోటుచేసుకున్న మార్పులు నాగరికత పతనానికి ప్రధాన కారణమని ఈజేహెచ్ మెకే సిద్ధాంతీకరించాడు. ఇతడి ప్రకారం క్రీ.పూ.1800 నాటికే సింధులోయ ప్రాంతంలో వర్షపాత శాతం తగ్గిపోయింది.

దీనికితోడు థార్ ఎడారి విస్తరించుట వలన నేలలో ఇసుకశాతం పెరిగి నేల వ్యవసాయానికి పనికిరానిదైంది. పైగా నదులు ముఖ్యంగా సరస్వతి నది తన గమనాన్ని మార్చుకోవడం వల్ల పట్టణాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా సింధు నాగరికతను పట్టణాలను ఎవరో ధ్వంసం చేయలేదు. ప్రజలే పట్టణాలను వదిలి వేరే ప్రాంతాలకు వలసపోయి ఉంటారని భావించబడింది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..